ఏపీలో వారికి కూడా తల్లికి వందనం.. | Thalliki Vandanam

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకమైన ‘తల్లికి వందనం ( Thalliki Vandanam )’ పథకాన్ని అనాథ పిల్లలకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన తాజా సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనాథ పిల్లల సంరక్షకుల వివరాలు సేకరించి వారి ద్వారా ఈ సాయం అందించాలని సూచించారు. ఒకవేళ సంరక్షకులు ఎవరూ లేకపోతే జిల్లా కలెక్టర్ల ద్వారా పంపిణీ చేయాలని లేదా నేరుగా అనాథ పిల్లల బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేసే విధానాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో జులై మూడో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ‘తల్లికి వందనం’ నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.15,000 అందిస్తుండగా, అందులో రూ.13,000 తల్లుల ఖాతాల్లో జమ చేసి, మిగిలిన రూ.2,000 పాఠశాలల నిర్వహణ ఖర్చుల కోసం కేటాయిస్తారు. ప్రస్తుతం తల్లుల బ్యాంకు ఖాతాలు, ఆధార్ పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని, ఇది పూర్తయిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు.

ఫీజుల వివరాలు ప్రదర్శించాలి ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేలా, ఆయా స్కూళ్లలో ఫీజుల వివరాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులపై మరియు పబ్లిక్ డొమైన్‌లో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రైవేట్ స్కూళ్ల అనుమతులకు సంబంధించిన అనవసర నిబంధనలను తొలగించాలన్నారు. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 2.03 లక్షల మంది విద్యార్థులకు ‘విద్యార్థి మిత్ర’ కిట్లను అందజేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

Ad
Check Status