Thalliki Vandanam నిధుల విడుదల తేదీ మార్పు!

Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు, ఇంటర్ కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదల వాయిదా పడింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అదే రోజు తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం ముందుగా భావించింది. అయితే అర్హుల వివరాల పరిశీలన కొనసాగుతుండటంతో జూన్ 19కి నిధుల విడుదలను మార్చారు.

ఈ పథకంలో దాదాపు 60 లక్షలకు పైగా లబ్ధిదారులు ఉన్నారు. అనర్హులకు చోటివ్వకుండా, అర్హులకే నిధులు అందేలా చూడటానికి ప్రభుత్వం కఠిన మార్గదర్శకాలతో క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన చేయిస్తోంది. స్కూళ్ల నుంచి సేకరించిన విద్యార్థుల డేటాను ఇప్పటికే సచివాలయాలకు పంపారు.

దీని ప్రకారం పరిశీలన జరుగుతుండటంతో డేటా ఖరారు ప్రక్రియ కాస్త ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ నెల 12న నిధుల విడుదల ఉండదని తేలిపోయింది. తాజాగా జూన్ 19న లేదా ఒక రోజు అటు, ఇటుగా నిధులను జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి సమాచారం వచ్చి, జాబితా సిద్ధమయ్యాక అధికారిక ప్రకటన చేయనున్నారు.