
మన పత్రిక వెబ్డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. గత ఏడాది మెగా డీఎస్సీ ద్వారా 15 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటన మేరకు, జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చే దిశగా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.
ఖాళీల లెక్కలు తీస్తున్న అధికారులు మెగా డీఎస్సీలో భర్తీ కాకుండా మిగిలిపోయిన సుమారు 400 పోస్టులతో పాటు, రాబోయే రోజుల్లో రిటైర్మెంట్ల ద్వారా ఏర్పడే ఖాళీలను కలిపి ఈ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
- పదోన్నతులు, బదిలీలు: వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ తర్వాత ఖాళీలపై స్పష్టమైన లెక్కలు రానున్నాయి.
- స్పెషల్ డీఎస్సీ: మరోవైపు 2,260 పోస్టులతో కూడిన స్పెషల్ డీఎస్సీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించింది. దీని భర్తీపై కూడా విద్యాశాఖ దృష్టి సారించింది.
- పరీక్షలు ఎప్పుడు?: అన్నీ అనుకున్నట్లు జరిగితే రాబోయే మార్చి లేదా ఏప్రిల్ నెలలో డీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
పరీక్ష విధానంలో కీలక మార్పులు? రాబోయే డీఎస్సీలో అభ్యర్థుల ఎంపిక విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలని విద్యాశాఖ యోచిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన పెరగడం, సాంకేతికత అవసరం దృష్ట్యా కొత్తగా రెండు పరీక్షలను పరిశీలిస్తున్నారు.
- ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్: ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో అనర్గళంగా బోధించగలిగేలా ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పరీక్షించనున్నారు.
- కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్: విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అందించేందుకు, టీచర్లకు కూడా కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు.
దీనిపై నోటిఫికేషన్ విడుదల సమయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.