
Eesha Movie Review: కథేంటంటే.. కల్యాణ్ (త్రిగుణ్), వినయ్ (అఖిల్ రాజ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు) నలుగురు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వీరికి దెయ్యాలు, ఆత్మలంటే అస్సలు నమ్మకం ఉండదు. మూఢనమ్మకాల పేరుతో ప్రజలను మోసం చేసే దొంగ బాబాల ఆట కట్టించడమే వీరి పని. ఈ క్రమంలోనే ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉండే ఆది దేవ్ (పృథ్వీరాజ్) బాబా గురించి వీరికి తెలుస్తుంది. అతడిని కూడా బూటకపు బాబాగా నిరూపించేందుకు అక్కడికి వెళ్తారు.
అయితే, “ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే..” అంటూ ఆది దేవ్ వీరికి ఒక సవాల్ విసురుతాడు. ఆ సవాల్‌ను స్వీకరించిన ఈ నలుగురు మిత్రులు మూడు రోజుల పాటు ఒక పాడుబడిన బంగ్లాలో ఉండటానికి ఒప్పుకుంటారు. ఆ బంగ్లాలో వారికి ఎదురైన భయానక అనుభవాలు ఏంటి? ఆత్మలు ఉన్నాయా? గిరిజనుడి (మైమ్ మధు) శరీరంలో ఉన్న పుణ్యవతి ఆత్మ కథేంటి? చివరికి ఈ మిత్రులు ఆ బంగ్లా నుంచి బయటపడ్డారా? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ (ఎలా ఉందంటే..) దెయ్యాలు ఉన్నాయా, లేవా అనే పాయింట్‌పై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ‘ఈషా’ (eesha telugu horror movie) కూడా అదే కోవలోకి చెందుతుంది. దెయ్యాలను నమ్మని హీరోహీరోయిన్లు, వాటిని సైంటిఫిక్‌గా నిరూపించేందుకు పాడుబడ్డ బంగ్లాకు వెళ్లడం.. అక్కడ వారికి వింత అనుభవాలు ఎదురుకావడం వంటివి రొటీన్ ఫార్మాట్‌లోనే సాగుతాయి. అయితే దర్శకుడు శ్రీనివాస్ మన్నె ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా.. కొన్ని చోట్ల భయపెట్టడంలో సఫలమయ్యారు.
సినిమా ప్రథమార్ధం అంతా నలుగురు మిత్రులు, వారి ప్రయాణం, బంగ్లాలో ప్రవేశించడంతో సాగుతుంది. బంగ్లాలో ఆత్మలు ఉన్నాయనే విషయాన్ని మాటల ద్వారా చెప్పడం కాస్త నిరాశ కలిగిస్తుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ట్విస్ట్, భయానక సన్నివేశం ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో పుణ్యవతి ఆత్మ కథ, క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా చనిపోయిన వారు తాము చనిపోయామని ఎందుకు ఒప్పుకోరు అనే పాయింట్‌తో క్లైమాక్స్‌ను డిజైన్ చేసిన తీరు బాగుంది. అయితే ఆది దేవ్ బాబా ఫ్లాష్‌బ్యాక్, పుణ్యవతి ఎపిసోడ్‌ను ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. క్లైమాక్స్‌లో సీజన్-2కు హింట్ ఇచ్చారు.
ఎవరెలా చేశారంటే.. త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫ్రెండ్స్ గ్యాంగ్‌గా వారి నటన సహజంగా ఉంది. ఆది దేవ్‌గా సీనియర్ నటుడు పృథ్వీరాజ్ లుక్ కొత్తగా ఉంది. అయితే ఈ సినిమాకు ప్రధాన బలం మైమ్ మధు. పుణ్యవతి ఆత్మ ఆవహించిన గిరిజనుడిగా ఆయన నటన భయపెడుతుంది. ఆయన ఆహార్యం, హావభావాలు హారర్ సినిమాకు కావాల్సిన మూడ్ క్రియేట్ చేశాయి. సాంకేతికంగా చూస్తే ఆర్ఆర్ ధృవన్ సంగీతం, సంతోష్ విజువల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
రేటింగ్ 2 .75 /5
బలాలు:
- ద్వితీయార్ధంలో వచ్చే హారర్ సన్నివేశాలు
- మైమ్ మధు నటన
- థ్రిల్ పంచే క్లైమాక్స్
బలహీనతలు:
- రొటీన్ కథ, కథనం
- ఊహకందే సన్నివేశాలు
- కొన్ని లాజిక్స్ మిస్ అవ్వడం
చివరిగా: ‘ఈషా’.. రొటీన్ హారర్ కథే అయినా.. అక్కడక్కడా భయపెడుతూ, క్లైమాక్స్‌లో థ్రిల్ పంచుతుంది.