
ఇంజినీరింగ్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నాలుగు నెలల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ‘కౌశలం’ (AP Kaushalam) పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేటు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా స్కిల్స్ ఉన్నవారిని ఎంపిక చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్ వారధిగా నిలవనుంది.
24 లక్షల మంది గుర్తింపు – ఎవరు అర్హులంటే?: రాష్ట్రంలో డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు, ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్నవారు, లేదా తమ అర్హతకు తగని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారిని ఏపీ ఐటీ శాఖ గుర్తించింది. ఆర్టీజీఎస్ (RTGS) డేటాలేక్ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఇలాంటి వారు సుమారు 24 లక్షల మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. వీరందరికీ, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు మధ్య అనుసంధానకర్తగా ఈ ‘కౌశలం’ పోర్టల్ పనిచేయనుంది.
రిజిస్ట్రేషన్ టూ జాబ్: ఎంపిక ప్రక్రియ ఇలా..
- రిజిస్ట్రేషన్: అభ్యర్థులు కౌశలం పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకుని లాగిన్ ఐడీ పొందాలి.
- టెస్టింగ్ & గ్రేడింగ్: అభ్యర్థుల టాలెంట్‌ను పరీక్షించడానికి ఒక ఎగ్జామ్ నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ‘గ్రేడింగ్’ ఇస్తారు.
- ఎంపిక: ఈ గ్రేడ్ ఆధారంగా కంపెనీలు తమకు కావాల్సిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తాయి.
- గైడెన్స్: మీకు ఏ రంగంలో ఉద్యోగం రావొచ్చు? అందుకు కావాల్సిన స్కిల్స్ ఏంటి? ఏ సర్టిఫికెట్ కోర్సులు చేయాలి? వంటి సూచనలు కూడా మీ లాగిన్ ఇన్‌బాక్స్‌లో కనిపిస్తాయి.
సంక్రాంతి తర్వాత భారీ ‘ఐటీ జాబ్ ఫెయిర్’: కౌశలం పోర్టల్ ప్రచారాన్ని జనవరి మొదటి వారంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణే, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ప్రారంభిస్తామని ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు. పోర్టల్‌లో రిజిస్టర్ అయిన కంపెనీలు, అగ్రిగేటర్లతో సంక్రాంతి పండుగ తర్వాత భారీ స్థాయిలో ‘ఐటీ జాబ్ ఫెయిర్’ నిర్వహించనున్నారు. అక్కడికక్కడే ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగాలు ఆఫర్ చేయనున్నారు.
కాలేజీ విద్యార్థులకూ ముందస్తు శిక్షణ: డిగ్రీ చివరి ఏడాది, బీటెక్ 3, 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను కూడా ఈ పోర్టల్‌లో చేర్చనున్నారు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు, కాలేజీలకు ముందస్తు సమాచారం ఇచ్చి, కోర్సు పూర్తయ్యేలోగా వారికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.